మార్కు 9:2-9

మార్కు 9:2-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకుని ఒంటరిగా ఎత్తైన కొండ మీదికి వెళ్లారు, అక్కడ వారి ముందు ఆయన రూపాంతరం చెందారు. ఆయన వస్త్రాలు మిరుమిట్లుగొలిపేంత తెల్లగా మారాయి, లోకంలో ఎవ్వరూ ఉతకలేనంత తెల్లగా. అప్పుడు మోషే, ఏలీయా ప్రత్యక్షమై యేసుతో మాట్లాడుతూ వారికి కనబడ్డారు. పేతురు యేసుతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు. అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు. అప్పుడు మేఘం వారిని కమ్ముకుంది, ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు. ఈయన మాటలను వినండి!” అకస్మాత్తుగా, వారు చుట్టూ చూసినప్పుడు, తమతో యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.

మార్కు 9:2-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు. పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు. తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.” వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.

మార్కు 9:2-9 పవిత్ర బైబిల్ (TERV)

ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన దుస్తులు మెరువ సాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపొయ్యాయి. ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు. పేతురు యేసుతో, “రబ్బీ! మనిమిక్కడే ఉండటం మంచిది. మేము మూడు పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అన్నాడు. శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు. అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది. వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు. వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.

మార్కు 9:2-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు. మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు–బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను; వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా –ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా–మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.