మార్కు 5:1-20

మార్కు 5:1-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

వారు సరస్సు దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్లారు. యేసు పడవ దిగిన వెంటనే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. వాడు సమాధుల్లో నివసించేవాడు, గొలుసులతో కూడా ఎవరు వాన్ని బంధించలేకపోయారు. ఎందుకంటే తరచుగా వాని కాళ్లుచేతులను గొలుసులతో బంధించేవారు కానీ, వాడు ఆ గొలుసులను తెంపి వాటిని ముక్కలు చేసేవాడు. వాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. వాడు పగలు రాత్రులు సమాధుల మధ్య, కొండల్లో కేకలువేస్తూ తనను తాను రాళ్లతో గాయపరచుకొనే వాడు. వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు. వాడు బిగ్గరగా కేకలువేస్తూ, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? దేవుని పేరట నన్ను వేధించవద్దు నిన్ను వేడుకొంటున్నాను!” అని అన్నాడు. ఎందుకంటే యేసు, “అపవిత్రాత్మా, వీన్ని విడిచిపో!” అని వానితో అన్నారు. అప్పుడు యేసు, “నీ పేరేమిటి?” అని వాన్ని అడిగారు. అందుకు వాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం” అని జవాబిచ్చాడు. “వాటిని ఆ ప్రాంతం నుండి బయటకు పంపివేయవద్దని” వాడు యేసును పదే పదే వేడుకున్నాడు. అక్కడ దగ్గరలో పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, “ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని యేసును బ్రతిమాలాయి. ఆయన వాటికి అనుమతి ఇచ్చారు, ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందులలోనికి చొరబడ్డాయి. ఇంచుమించు రెండువేల పందులు గల ఆ మంద, వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది. ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ జరిగినదంతా తెలియజేశారు, అప్పుడు ఏమి జరిగిందో చూడడానికి ప్రజలు వెళ్లారు. వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, సేన దయ్యం పట్టినవాడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, అక్కడ కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు. జరిగింది చూసినవారు దయ్యాలు పట్టినవాని గురించి పందుల గురించి ఊరి వారికి తెలియజేశారు. అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. యేసు పడవ ఎక్కుతున్నప్పుడు, దయ్యాలు పట్టినవాడు ఆయనతో పాటు వస్తానని బ్రతిమాలాడు. యేసు వాన్ని అనుమతించలేదు, కాని వానితో, “నీవు నీ ఇంటికి నీ సొంతవారి దగ్గరకు వెళ్లు, ప్రభువు నీ పట్ల చేసిన మేలును, నీ పట్ల చూపిన కనికరం గురించి వారికి చెప్పు” అన్నారు. కాబట్టి వాడు వెళ్లిపోయి దెకపొలిలోని పది పట్టణాల్లో యేసు తనకు చేసిన దానిని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అది విన్నవారందరు ఆశ్చర్యపడ్డారు.

మార్కు 5:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు. యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు. వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు. ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి. ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు. యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు. అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.

మార్కు 5:1-20 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు. వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు. వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు. వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు. “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు. ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు. యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు. “నా పేరు ‘పటాలం’. మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి. ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది. ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి. యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి. ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది. జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు. వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు. యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు. అతడు వెళ్ళి దెకపొలిలో యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.

మార్కు 5:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పెట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి –యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన–అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన–నీ పేరేమని వానినడుగగా వాడు–నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక – ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పెట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.