మార్కు 4:35-41

మార్కు 4:35-41 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ రోజు సాయంకాలమైనప్పుడు, ఆయన తన శిష్యులతో, “మనం సరస్సు దాటి అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నారు. జనసమూహాన్ని విడిచిపెట్టి, ఉన్నపాటుననే, ఆయన పడవ ఎక్కగా వారు ఆయనను తీసుకెళ్లారు. మరికొన్ని పడవలు కూడా వారి వెంట వెళ్లాయి. అప్పుడు భయంకరమైన తుఫాను రేగి, అలలు పడవ మీద ఎగసిపడ్డాయి, పడవ నీటితో నిండిపోసాగింది. యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకుని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది. ఆయన తన శిష్యులతో, “మీరు ఎందుకంతగా భయపడుతున్నారు? ఇప్పటికీ మీకు విశ్వాసం లేదా?” అన్నారు. వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.

మార్కు 4:35-41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

మార్కు 4:35-41 పవిత్ర బైబిల్ (TERV)

ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది. ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు. వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.

మార్కు 4:35-41 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను. ఆయన దోనె అమరమున తలగడమీద (తల వాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి–బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన–మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి–ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.