మార్కు 4:16-19 - Compare All Versions
మార్కు 4:16-19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును.
మార్కు 4:16-19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు. కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు. కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
మార్కు 4:16-19 TERV (పవిత్ర బైబిల్)
“మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు. “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.
మార్కు 4:16-19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరికొందరు, రాతి నేలలో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో, వారు కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు, వారు త్వరగా పడిపోతారు. ఇంకా ఇతరులు ముళ్ళపొదల్లో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు. కాని జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనమోసం ఇతర కోరికలు ఆ వాక్యాన్ని అణచివేసి, ఫలించకుండా చేస్తాయి.