మార్కు 3:7-21

మార్కు 3:7-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్లారు, అలాగే గలిలయ నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన చేస్తున్న గొప్ప కార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యొర్దాను అంతటా తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు. జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు. ఆయన చాలామందిని స్వస్థపరిచారు, కాబట్టి వ్యాధులు ఉన్నవారు ఆయనను ముట్టుకోవాలని ముందుకు వస్తున్నారు. అపవిత్రాత్మలు ఆయనను చూడగానే, ఆయన ముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలు వేశాయి. అయితే ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత యేసు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచారు, వారు ఆయన దగ్గరకు వచ్చారు. తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండుమందిని నియమించుకొని దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికిచ్చారు. ఆ పన్నెండుమంది ఎవరనగా: ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను; (వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు; దాని అర్థం “ఉరుము కుమారులు”), అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, అత్యాసక్తి కలవాడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు మరల గుంపుగా కూడి వచ్చారు, కాబట్టి ఆయన శిష్యులు భోజనం కూడా చేయలేకపోయారు. అది విని ఆయన కుటుంబీకులు, “ఆయనకు మతిపోయింది” అని చెప్పి ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

మార్కు 3:7-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతం నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు. ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఆయన చాలామందిని బాగు చేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు. యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు. తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు. వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు), జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం), అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, యేసును పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా. తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు “ఈయనకు మతి స్థిమితం లేదు” అన్నారు.

మార్కు 3:7-21 పవిత్ర బైబిల్ (TERV)

యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు. చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి. యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు. యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు. ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి: సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు. జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, జెలటు అని పిలవబడే సీమోను, యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.

మార్కు 3:7-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పెట్టినవారు ఆయనను చూడ గానే ఆయన యెదుట సాగిలపడి–నీవు దేవుని కుమారుడ వని చెప్పుచు కేకలువేసిరి. తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండ యెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతోకూడ ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండు మందిని నియమించెను. వారెవరనగా–ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయ నేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.