మార్కు 16:5-7 - Compare All Versions
మార్కు 16:5-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందు కతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను.
మార్కు 16:5-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”
మార్కు 16:5-7 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది. ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
మార్కు 16:5-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకుని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చుని ఉండడం చూసి, చాలా భయపడ్డారు. అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. అయితే వెళ్లి, ఆయన శిష్యులతో, పేతురుతో, ‘ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. ఆయన మీతో చెప్పినట్లే, అక్కడ మీరు ఆయనను చూస్తారు’ ” అని చెప్పండని ఆ స్త్రీలతో చెప్పాడు.