మార్కు 13:32-36 - Compare All Versions
మార్కు 13:32-36 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అయితే ఆ దినం గురించి, ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా ఉండండి! మెలకువగా ఉండండి! ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. అది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్తున్న ఒక మనిషిని పోలి ఉంది: అతడు సేవకులకు అధికారం ఇచ్చి, ప్రతీ సేవకునికి వారి వారి పనులను అప్పగించి, ద్వారం దగ్గర ఉన్నవానికి కాపలా కాయమని చెప్తాడు. “ఇంటి యజమాని సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, లేదా సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. అతడు ఒకవేళ అకస్మాత్తుగా వస్తే, మీరు నిద్రపోవడం చూస్తాడేమో అని జాగ్రత్తగా ఉండండి!
మార్కు 13:32-36 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు. ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!
మార్కు 13:32-36 TERV (పవిత్ర బైబిల్)
“ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి. ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు. “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు. ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో.
మార్కు 13:32-36 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి – మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.) ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.