మార్కు 10:2-16

మార్కు 10:2-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. వారు, “విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెను పంపించడానికి మోషే పురుషునికి అనుమతించాడు” అన్నారు. అందుకు యేసు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఈ ఆజ్ఞను మీ కోసం వ్రాశాడు. సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగాను స్త్రీగాను’ సృజించారు. ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు. కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు. వారందరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, శిష్యులు వీటి గురించి యేసుని వివరంగా చెప్పమని అడిగారు. ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, “తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు ఆమెకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని పెళ్ళి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.” ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు, కాని శిష్యులు వారిని గద్దించారు. యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు. అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకుని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు.

మార్కు 10:2-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు. యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు. యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు. అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు. యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు. ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు. ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు.

మార్కు 10:2-16 పవిత్ర బైబిల్ (TERV)

కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయ సమ్మతమేనా?” అని అడిగారు. యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. వాళ్ళు, “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు. యేసు, “మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు. కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ‘ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు’ అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయకూడదు” అని అన్నాడు. అంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు. అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.” యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది. ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు” అని అన్నాడు. ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వదించాడు.

మార్కు 10:2-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకై–పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి. అందుకాయన–మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారి నడిగెను. వారు–పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా యేసు–మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. అందుకాయన–తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.