మార్కు 10:13-16
మార్కు 10:13-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు, కాని శిష్యులు వారిని గద్దించారు. యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు. అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకుని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు.
మార్కు 10:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు. ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు. ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు.
మార్కు 10:13-16 పవిత్ర బైబిల్ (TERV)
యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది. ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు” అని అన్నాడు. ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వదించాడు.
మార్కు 10:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి–చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంక పరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.