మత్తయి 9:9-13
మత్తయి 9:9-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు అక్కడినుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒక వ్యక్తిని చూసి, “నన్ను వెంబడించు” అని అతనితో అన్నారు. మత్తయి లేచి ఆయనను వెంబడించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో పాటు కలిసి భోజనం చేశారు. ఇది చూసిన పరిసయ్యులు, “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు. అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. అందుకే మీరు వెళ్లి, ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను” అన్నారు.
మత్తయి 9:9-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు. పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు. యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.
మత్తయి 9:9-13 పవిత్ర బైబిల్ (TERV)
యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు. యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు. యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’ అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
మత్తయి 9:9-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి–నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి–మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనముచేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక–కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.