మత్తయి 9:1-8
మత్తయి 9:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకున్నారు. కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. అప్పుడు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని చెప్పుకొన్నారు. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయాల్లో ఈ దురాలోచనలు ఎందుకు రానిస్తున్నారు? వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేదా ‘లేచి నడువు’ అని చెప్పడమా? అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు, అతడు లేచి ఇంటికి వెళ్లాడు. జనసమూహం అది చూసి, వారు భయంతో నిండుకొని, మానవునికి ఇలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవుని స్తుతించారు.
మత్తయి 9:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు. కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు. ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు. యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు? ‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా? అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
మత్తయి 9:1-8 పవిత్ర బైబిల్ (TERV)
యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు. ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు. వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
మత్తయి 9:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపెట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి –కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు–ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి–మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.