మత్తయి 7:7-14
మత్తయి 7:7-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది. “మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా? చేప అడిగితే పాము ఇస్తారా? మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా! కాబట్టి ఏ విషయంలోనైనా ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే. “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు. జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.
మత్తయి 7:7-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు. “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.
మత్తయి 7:7-14 పవిత్ర బైబిల్ (TERV)
“అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది. “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు. “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం. “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.
మత్తయి 7:7-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.