మత్తయి 7:15-23

మత్తయి 7:15-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకుని మీ దగ్గరకు వస్తారు; లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలంతో మీరు వారిని గుర్తించగలరు. ముళ్ళపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరులాంటి ముళ్ళ మొక్కల్లో అంజూర పండ్లను ప్రజలు కోస్తారా? ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డపండ్లు కాస్తుంది. మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. “ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వారితో, ‘మీరెవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని చెప్తాను.

మత్తయి 7:15-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.

మత్తయి 7:15-23 పవిత్ర బైబిల్ (TERV)

“కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు. “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.

మత్తయి 7:15-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. –ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.