మత్తయి 7:1-23 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 7:1-23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీదపడి మిమ్మును చీల్చి వేయును. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. –ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
మత్తయి 7:1-23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు. మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది. నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు? నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు? కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది. పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టవద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో. “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా! అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు. “కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే. “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.
మత్తయి 7:1-23 TERV (పవిత్ర బైబిల్)
“ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు. మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు. “మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు? మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు? కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు. “పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి. “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది. “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు. “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం. “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి. “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు. “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.
మత్తయి 7:1-23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“తీర్పు తీర్చకండి. అప్పుడు మీకు కూడ తీర్పు తీర్చబడదు. మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది. “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకుని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ముందు వేయకండి. మీరు అలా చేస్తే ఆ పందులు తమ కాళ్లతో వాటిని త్రొక్కివేసి, మీమీద పడి మిమ్మల్ని ముక్కలుగా చీల్చివేస్తాయి. “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది. “మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా? చేప అడిగితే పాము ఇస్తారా? మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా! కాబట్టి ఏ విషయంలోనైనా ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే. “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు. జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు. “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకుని మీ దగ్గరకు వస్తారు; లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలంతో మీరు వారిని గుర్తించగలరు. ముళ్ళపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరులాంటి ముళ్ళ మొక్కల్లో అంజూర పండ్లను ప్రజలు కోస్తారా? ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డపండ్లు కాస్తుంది. మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. “ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వారితో, ‘మీరెవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని చెప్తాను.