మత్తయి 6:1-18
మత్తయి 6:1-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు. “కాబట్టి మీరు ఎవరికైనా దానం చేస్తే ఇతరుల నుండి ఘనత పొందాలని సమాజమందిరాల్లోను వీధుల్లోను ప్రకటించుకునే వేషధారుల్లా బూరలు ఊదించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. “మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి. మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి. “మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి: “ ‘పరలోకమందున్న మా తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక; పరలోకంలో జరుగునట్లు భూమి మీద, మీ చిత్తం జరుగును గాక. మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’ మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు. “మీరు ఉపవాసం ఉన్నప్పుడు, తాము ఉపవాసం ఉంటున్నామని ఇతరులకు తెలియాలని తమ ముఖాలను నీరసంగా పెట్టుకొనే వేషధారుల్లా నీరసంగా ఉండవద్దు. అలా చేసినవారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కోండి. అప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని కనిపించని మీ తండ్రికి తప్ప ఇతరులకు తెలియదు; రహస్యంగా చేసింది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
మత్తయి 6:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను. నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను. నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు. కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక. నీ రాజ్యం వస్తుంది గాక. పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక. మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి. మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు. మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.” “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను. నువ్వు ఉపవాసం ఉన్నపుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా, ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని, తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో. అప్పుడు ప్రజలకు కాక, రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు. అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
మత్తయి 6:1-18 పవిత్ర బైబిల్ (TERV)
“జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు. “అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు. “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం — వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు. “అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము. ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి, మేము చేసిన పాపాలను కూడా క్షమించుము. మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు. పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’ ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు. “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
మత్తయి 6:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పర లోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును; కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.