మత్తయి 5:21-48 - Compare All Versions
మత్తయి 5:21-48 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘మీరు హత్య చేయకూడదు. ఎవరైనా హత్య చేస్తే, వారు శిక్షకు గురవుతారు’ అని మీ పూర్వికులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా. కాని నేను చెప్పేదేంటంటే, తన సహోదరుని మీద కాని సహోదరి మీద కాని కోప్పడేవారు తీర్పుకు గురవుతారు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవారు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ‘వెర్రివాడ లేదా వెర్రిదాన!’ అనే వారికి నరకాగ్నికి తప్పదు. “కాబట్టి మీరు బలిపీఠం దగ్గర కానుకను అర్పిస్తూ ఉండగా మీ సహోదరునికైనా సహోదరికైనా మీమీద ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి. “మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు. అప్పుడు జరిగేదేంటంటే చివరి పైసా చెల్లించే వరకు మీరు బయట పడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి స్త్రీని కామంతో చూస్తేనే అతడు తన మనస్సులో ఆమెతో వ్యభిచారం చేసినట్టు. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. “ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’ అని చెప్పబడింది. కానీ నేను మీతో చెప్పేదేంటంటే, ఒక్క వ్యభిచార విషయంలో తప్ప తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నట్టే. విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్టే. “అంతేగాక, ‘మీరు మాట ఇస్తే తప్పకూడదు. చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, అసలు మీరు ఒట్టు పెట్టుకోవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం; భూమి తోడని అనవద్దు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం; యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణం. మీ తలమీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే మీరు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేరు కదా. మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే. “ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే వారితో మీరు రెండు మైళ్ళు వెళ్లండి. ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు. “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలవాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా! ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:21-48 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు. “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో. నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు. నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో. చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను. “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు. నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. “‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు. నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే. “‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా. కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి. ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
మత్తయి 5:21-48 TERV (పవిత్ర బైబిల్)
“పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది. “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి. “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు. “‘వ్యభిచారం చేయరాదు’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పే వాళ్ళు. కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు. “అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి. భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి. మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి. మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే. “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’ అని అనటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి. “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు. కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
మత్తయి 5:21-48 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా – తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవా డగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా; నేను మీతో చెప్పునదేమనగా–వ్యభిచారకారణమునుబట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు–నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా, నేను మీతో చెప్పునదేమనగా–ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. పె కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.