మత్తయి 4:1-7
మత్తయి 4:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది. శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని చెప్పు” అని అన్నాడు. అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదాలకు ఒక్క రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’” అని అన్నాడు. అందుకు యేసు అతనితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
మత్తయి 4:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు. అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు.
మత్తయి 4:1-7 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు. యేసు సమాధానంగా, “‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు. కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’ అని వ్రాసారు” అని అన్నాడు. ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే, ‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’ అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు. యేసు వానితో
మత్తయి 4:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను అందుకాయన –మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి –నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము – ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు – ప్రభు వైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.