మత్తయి 3:13-16
మత్తయి 3:13-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి గలిలయ నుండి యొర్దానుకు వచ్చారు. కాని యోహాను ఆయనతో, “నేనే నీ ద్వారా బాప్తిస్మం పొందాలి, అలాంటిది నీవు నా దగ్గరకు వస్తున్నావా?” అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు. అందుకు యేసు, “ఇప్పటికి ఇలా కానివ్వు. నీతి అంతటిని నెరవేర్చడానికి ఇలా చేయడం మనకు సరియైనది” అని చెప్పారు. కాబట్టి యోహాను ఒప్పుకున్నాడు. యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూశాడు.
మత్తయి 3:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు. కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు. యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
మత్తయి 3:13-16 పవిత్ర బైబిల్ (TERV)
గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు. కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు. యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగనివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు. యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పాపురంలాగ తన మీదికి రావటం యేసు చూసాడు.
మత్తయి 3:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు–ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.