మత్తయి 3:1-12

మత్తయి 3:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఆ రోజుల్లో బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి యూదయలోని అరణ్యంలో, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటిస్తున్నాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా: “ ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం” అని ఇతని గురించే చెప్పింది. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను, నడుముకు తోలుదట్టీ ధరించేవాడు. అతడు మిడతలు, అడవి తేనె తినేవాడు. యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి, తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. అయితే తాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి పరిసయ్యులు సద్దూకయ్యులలో చాలామంది రావడం చూసి అతడు వారితో, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడని మీతో చెప్తున్నాను. ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. “పశ్చాత్తాపం కోసం నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కళ్లాన్ని శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు” అని అన్నాడు.

మత్తయి 3:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు. పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే. ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి, తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు. చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను. ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు. పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.

మత్తయి 3:1-12 పవిత్ర బైబిల్ (TERV)

బాప్తిస్మము యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు. ఇతణ్ణి గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు: “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని, తిన్నని మార్గాన్ని వెయ్యమని’ ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.” యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్యబడిన వస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి, తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళను చూసి, “మీరు సర్పసంతానం. దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను. చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు. “మీరు మారుమనస్సు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మము నిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నా కన్నా శక్తి కలవాడు! ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో, అగ్నితో, బాప్తిస్మము నిస్తాడు. తూర్పార బట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకొంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు” అని అన్నాడు.

మత్తయి 3:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి –పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి–సర్పసంతానమా, రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. –అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.