మత్తయి 28:10-20

మత్తయి 28:10-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు వారితో, “భయపడకండి, మీరు వెళ్లి నా సహోదరులను గలిలయకు వెళ్లుమని చెప్పండి; అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారికి చెప్పారు. ఆ స్త్రీలు మార్గంలో ఉండగానే, సమాధి దగ్గర ఉన్న కావలివారిలో కొంతమంది పట్టణంలోనికి వెళ్లి, జరిగిన విషయాలన్నిటిని ముఖ్య యాజకులతో చెప్పారు. ముఖ్య యాజకులు యూదా పెద్దలతో కలసి ఆలోచించి, ఆ సైనికులకు చాలా డబ్బు లంచంగా ఇచ్చి, “మేము నిద్రపోతున్నప్పుడు, ‘రాత్రి సమయంలో యేసు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు’ అని చెప్పండి. ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు. కాబట్టి సైనికులు ఆ డబ్బు తీసుకుని వారితో చెప్పిన ప్రకారం చేశారు. ఈ కథ ఇప్పటికీ యూదులలో చాలా వ్యాపించి ఉంది. ఆ పదకొండు మంది శిష్యులు యేసు తమకు చెప్పినట్లే, గలిలయలోని కొండకు వెళ్లారు. వారు ఆయనను చూసినప్పుడు, ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు. యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను శిష్యులుగా చేసి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను” అని వారితో చెప్పారు.

మత్తయి 28:10-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు. వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి, “మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి. ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు. సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది. పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు. అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

మత్తయి 28:10-20 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు యేసు వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను కలుసుకొంటారు” అని అన్నాడు. ఆ స్త్రీలు వెళ్ళిపొయ్యారు. అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు. ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు. వాళ్ళు భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో, “అతని శిష్యులు, ‘మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు’ అని చెప్పండి. ఈ వార్త రాష్ట్రపాలుకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని అన్నారు. భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికి వాడుకలో ఉంది. ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు. అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి. నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.

మత్తయి 28:10-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు–భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధానయాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతోకూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది. పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి. అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.