మత్తయి 27:3-8

మత్తయి 27:3-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు. అతడు వారితో, “నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను” అని అన్నాడు. అందుకు వారు, “దానితో మాకేంటి? అది నీ సమస్య” అని జవాబిచ్చారు. అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడినుండి వెళ్లి, ఉరి వేసుకున్నాడు. ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసుకుని, “ఇవి రక్తపు వెల కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పి, వారు ఆలోచించి ఆ డబ్బుతో విదేశీయులను సమాధి చేయడానికి ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు. అందుకే నేటి వరకు ఆ పొలం రక్తపొలం అని పిలువబడుతూ ఉంది.

మత్తయి 27:3-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు. వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు.

మత్తయి 27:3-8 పవిత్ర బైబిల్ (TERV)

యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ, “నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు. వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు. యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు. వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి” అని అంటారు.

మత్తయి 27:3-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి – నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసి కొని – ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.