మత్తయి 27:27-44

మత్తయి 27:27-44 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు. వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు. వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు. వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు. వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు. వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు. ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు. ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు. అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము. వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు. ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.

మత్తయి 27:27-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు. వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.

మత్తయి 27:27-44 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు. ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు. ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు. ఆయన్ని హేళన చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకెళ్ళారు. వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతణ్ణి బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు. వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. (గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.) అక్కడ చేదుకలిపిన ద్రాక్షరసాన్ని యేసుకు త్రాగటానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు. ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు. సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు. ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు. ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు. ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు. ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, “అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము. అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు.

మత్తయి 27:27-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని–యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. –ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు –దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు –వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.