మత్తయి 26:69-75
మత్తయి 26:69-75 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది. అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు. తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది. పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు. కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు. అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది. “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
మత్తయి 26:69-75 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు. అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు. కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది. “ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.
మత్తయి 26:69-75 పవిత్ర బైబిల్ (TERV)
ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!” అని అడిగింది. కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు. ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది. పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు. కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు. అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
మత్తయి 26:69-75 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా అనెను. అందుకతడు– నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టుపెట్టుకొని–నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి–నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు– ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక–కోడి కూయకమునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.