మత్తయి 26:59-68 - Compare All Versions
మత్తయి 26:59-68 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు. చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు. వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.” అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు. అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు. అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.” అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి, “క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు.
మత్తయి 26:59-68 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు.
మత్తయి 26:59-68 TERV (పవిత్ర బైబిల్)
మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.” అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు. కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు. యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా! మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు.
మత్తయి 26:59-68 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి –వీడు దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి. ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు– నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారు–వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; కొందరు ఆయనను అరచేతులతో కొట్టి – క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.