మత్తయి 26:51-54
మత్తయి 26:51-54 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేశాడు. యేసు వానితో, “నీ కత్తిని దాని ఒరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా? కాని, ఈ విధంగా జరగాలని లేఖనాల్లో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు.
మత్తయి 26:51-54 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.
మత్తయి 26:51-54 పవిత్ర బైబిల్ (TERV)
యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు. యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు.
మత్తయి 26:51-54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనినయెడల–ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.