మత్తయి 26:33-35 - Compare All Versions
మత్తయి 26:33-35 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు. అందుకు యేసు అతనితో, “ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు.
మత్తయి 26:33-35 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు. యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు. పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
మత్తయి 26:33-35 TERV (పవిత్ర బైబిల్)
పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు. యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు. కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు.
మత్తయి 26:33-35 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.