మత్తయి 26:26-29
మత్తయి 26:26-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకుని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు. తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి. ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము. నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.”
మత్తయి 26:26-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.
మత్తయి 26:26-29 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు. ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి. ఇది నా ఒడంబడిక రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
మత్తయి 26:26-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు భోజనముచేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి –మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి–దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతోకూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్త దిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.