మత్తయి 26:1-5 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:1-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి –రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేతపట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచనచేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు–పండుగలో వద్దని చెప్పుకొనిరి.
మత్తయి 26:1-5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో, “రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు. ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు. వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు. అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు.
మత్తయి 26:1-5 TERV (పవిత్ర బైబిల్)
యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు. ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు” అని అనుకొన్నారు.
మత్తయి 26:1-5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో, “మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు. వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు. కాని పండుగ సమయంలో వద్దు, “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు.