మత్తయి 25:35-40
మత్తయి 25:35-40 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు. నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు. “అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము? ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము? ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు. “అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
మత్తయి 25:35-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు. అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.
మత్తయి 25:35-40 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు. “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు. “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.
మత్తయి 25:35-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.