మత్తయి 25:14-18
మత్తయి 25:14-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు మరొక ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, దూర దేశానికి ప్రయాణమై, తన ఇంట్లో పని చేసి సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఒక మనుష్యుని పోలి ఉంది. ఆయన వారిలో ఒకనికి అయిదు తలాంతుల బంగారం, ఇంకొకనికి రెండు తలాంతుల బంగారం, మరొకనికి ఒక తలాంతు బంగారం, ఎవని సామర్థ్యాన్ని బట్టి వానికి ఇచ్చాడు. తర్వాత అతడు ప్రయాణమై వెళ్లాడు. అయిదు తలాంతుల బంగారం తీసుకున్నవాడు వెంటనే వెళ్లి వెంటనే ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా అయిదు తలాంతులను సంపాదించాడు. అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. అయితే ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు మాత్రం వెళ్లి, భూమిలో ఒక గుంట త్రవ్వి దానిలో తన యజమానుని ఇచ్చిన ఒక్క తలాంతును దాచిపెట్టాడు.
మత్తయి 25:14-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు. ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.
మత్తయి 25:14-18 పవిత్ర బైబిల్ (TERV)
“దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకు అప్పగించాడు. ఒకనికి ఐదు తలాంతుల ధనం ఇచ్చాడు. రెండవ వానికి రెండు తలాంతులు, మూడవ వానికి ఒక తలాంతు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. ఐదు తలాంతులు పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో ఐదు తలాంతులు సంపాదించాడు. అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు. కాని ఒక తలాంతు పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు.
మత్తయి 25:14-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.