మత్తయి 24:1-14

మత్తయి 24:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించారు. అందుకు యేసు, “మీరు ఇవన్నీ చూస్తున్నారా? ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. యేసు ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు. యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం వెంటనే రాదు. జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. “అప్పుడు హింసించబడడానికి మరణానికి మీరు అప్పగించబడతారు, నన్ను బట్టి మీరు అన్ని రాజ్యాలచేత ద్వేషించబడతారు. ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు. అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతోమందిని మోసపరుస్తారు. దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది.

మత్తయి 24:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు. అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు. ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు. అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే. “అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు. ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు. అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు. అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.

మత్తయి 24:1-14 పవిత్ర బైబిల్ (TERV)

యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు. యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు. యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట. “ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.

మత్తయి 24:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన – మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములనుగూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.