మత్తయి 23:24-26
మత్తయి 23:24-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గ్రుడ్డి మార్గదర్శకులారా! మీరు చిన్న దోమను వడగడతారు కాని ఒంటెను మ్రింగుతారు. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు. గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది.
మత్తయి 23:24-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.
మత్తయి 23:24-26 పవిత్ర బైబిల్ (TERV)
గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు. “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.
మత్తయి 23:24-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.