మత్తయి 22:15-22
మత్తయి 22:15-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును తన మాటల్లోనే ఎలా చిక్కించాలని ఆలోచించారు. హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు” అని అడిగారు. అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? పన్నుకట్టే ఒక నాణెము నాకు చూపించండి” అన్నారు. అందుకు వారు ఒక దేనారం తెచ్చారు. ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయనను విడిచి వెళ్లిపోయారు.
మత్తయి 22:15-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు. సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు. యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.
మత్తయి 22:15-22 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు. వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు. యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
మత్తయి 22:15-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు –బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతోకూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు–కైసరువనిరి. అందుకాయన–ఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి.