మత్తయి 22:1-14
మత్తయి 22:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు మరలా ఉపమానరీతిలో వారితో మాట్లాడుతూ, “పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారుని కోసం ఏర్పాటుచేసిన గొప్ప పెండ్లి విందును పోలి ఉంది. ఆ పెండ్లివిందుకు పిలువబడినవారిని రమ్మని పిలువడానికి అతడు తన పనివారిని పంపించాడు, కాని వారు రావడానికి తిరస్కరించారు. “కాబట్టి ఆయన ఆహ్వానించిన వారి దగ్గరకు మరికొందరు పనివారిని పంపించి, ‘ఇదిగో, నేను విందు సిద్ధపరిచాను: నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెండ్లివిందుకు రండి’ అని చెప్పమన్నాడు. “కానీ వారు అతని మాటలు లెక్కచేయకుండా ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఆ పిలుపును తెచ్చిన పనివారిని పట్టుకుని, అవమానించి వారిని చంపారు. కాబట్టి రాజు కోప్పడి తన సైన్యాన్ని పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. “అప్పుడు అతడు తన పనివారితో, ‘పెండ్లి విందు సిద్ధంగా ఉంది, గాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు. కాబట్టి మీరు వీధి మూలలకు పోయి మీకు కనబడిన వారినందరిని పెండ్లివిందుకు ఆహ్వానించండి’ అని తన పనివారితో చెప్పాడు. ఆ పనివారు వీధులలోనికి పోయి తమకు కనబడిన చెడ్డవారిని, మంచివారిని అందరిని పోగుచేశారు, కాబట్టి ఆ పెండ్లి వేదిక అంతా విందుకు వచ్చిన అతిథులతో నిండిపోయింది. “కాని ఆ రాజు అతిథులను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు, అక్కడ పెండ్లి వస్త్రాలను వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు. రాజు వానితో, ‘స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. వాడు మౌనంగా ఉండిపోయాడు. “అప్పుడు ఆ రాజు తన పనివారితో, ‘వీని చేతులు కాళ్లు కట్టి, బయట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి’ అని చెప్పారు. “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.”
మత్తయి 22:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు, “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు. అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు. ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”
మత్తయి 22:1-14 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు. “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు. “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు. “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది. “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు. “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
మత్తయి 22:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు–ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు–పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి –స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.