మత్తయి 21:1-7
మత్తయి 21:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు” అని చెప్పి వారిని పంపారు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది: “ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారీ చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’ అని సీయోను కుమారితో చెప్పండి.” శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు.
మత్తయి 21:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, “మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే, “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.” అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు.
మత్తయి 21:1-7 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.” దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది: “‘గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’ అని సీయోను కుమారితో చెప్పండి.” శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు.
మత్తయి 21:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.