మత్తయి 20:20-22
మత్తయి 20:20-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి, ఆయన పాదాల ముందు మోకరించి ఒక మనవి చేసింది. యేసు ఆమెను, “నీకేమి కావాలి?” అని అడిగారు. అందుకు ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఇంకొకడు నీ ఎడమవైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వండి” అని ఆయనతో అన్నది. యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా?” అని అడిగారు. వారు, “మేము త్రాగగలం” అని జవాబిచ్చారు.
మత్తయి 20:20-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. “నీకేమి కావాలి?” అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, “నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున, మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు” అంది. అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు.
మత్తయి 20:20-22 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది. యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు. ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది. యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు. “త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
మత్తయి 20:20-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా –నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు–త్రాగగలమనిరి.