మత్తయి 20:1-7

మత్తయి 20:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ, “పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో కూలికి పని చేసేవారిని తీసుకురావాలని వేకువనే బయలుదేరిన ఒక యజమానిని పోలి ఉంది. అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు. “ఉదయకాలం దాదాపు తొమ్మిది గంటలకు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్న మరి కొంతమందిని అతడు చూశాడు. వారితో, ‘మీరు కూడా వెళ్లి ద్రాక్షతోటలో పని చేయండి, మీకు ఏది న్యాయమో అది మీకు చెల్లిస్తాను’ అని వారితో చెప్పాడు. కాబట్టి వారు కూడా వెళ్లారు. “మళ్ళీ దాదాపు పన్నెండు గంటలకు, తిరిగి మూడు గంటలకు అతడు వెళ్లి అలాగే చేశాడు. దాదాపు అయిదు గంటలకు కూడా మరికొందరు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్నారని చూసి, ‘రోజంతా ఇక్కడ మీరు ఏ పనిలేక ఖాళీగా ఎందుకు నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. “అందుకు వారు, ‘ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అని చెప్పారు. “కాబట్టి అతడు వారితో, ‘మీరు కూడా వెళ్లి, నా ద్రాక్షతోటలో పని చేయండి’ అని చెప్పాడు.

మత్తయి 20:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి, ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి. ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను’ అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు. దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్ళి, ఆ విధంగా చేశాడు. మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి, ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి, ‘మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. వారు ‘ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అన్నారు. అతడు, ‘అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి’ అన్నాడు.

మత్తయి 20:1-7 పవిత్ర బైబిల్ (TERV)

యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు. “అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు. “అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు. “‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు. “అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు.

మత్తయి 20:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి –మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.