మత్తయి 20:1-16

మత్తయి 20:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ, “పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో కూలికి పని చేసేవారిని తీసుకురావాలని వేకువనే బయలుదేరిన ఒక యజమానిని పోలి ఉంది. అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు. “ఉదయకాలం దాదాపు తొమ్మిది గంటలకు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్న మరి కొంతమందిని అతడు చూశాడు. వారితో, ‘మీరు కూడా వెళ్లి ద్రాక్షతోటలో పని చేయండి, మీకు ఏది న్యాయమో అది మీకు చెల్లిస్తాను’ అని వారితో చెప్పాడు. కాబట్టి వారు కూడా వెళ్లారు. “మళ్ళీ దాదాపు పన్నెండు గంటలకు, తిరిగి మూడు గంటలకు అతడు వెళ్లి అలాగే చేశాడు. దాదాపు అయిదు గంటలకు కూడా మరికొందరు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్నారని చూసి, ‘రోజంతా ఇక్కడ మీరు ఏ పనిలేక ఖాళీగా ఎందుకు నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. “అందుకు వారు, ‘ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అని చెప్పారు. “కాబట్టి అతడు వారితో, ‘మీరు కూడా వెళ్లి, నా ద్రాక్షతోటలో పని చేయండి’ అని చెప్పాడు. “సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకునితో, ‘పనివారిని పిలిచి వారికి చివరి నుండి మొదట వచ్చిన వారివరకు కూలి ఇవ్వమని’ చెప్పాడు. “దాదాపు అయిదు గంటలకు కూలికి వచ్చినవారు వచ్చి ఒక్కొక్కరు ఒక దేనారం కూలి తీసుకున్నారు. అది చూసి, మొదట కూలి పనికి వచ్చినవారు, మిగతా వారికంటే తమకు ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశించారు. కాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. వారు కూలి తీసుకుని, ‘మేము ఉదయం నుండి ఎండలో కష్టపడి పని చేశాము అయినా చివరిలో వచ్చి ఒక్క గంట మాత్రమే పని చేసిన వారితో సమానంగా కూలి ఇచ్చారు’ అని యజమానుని మీద సణుగుకొన్నారు. “అందుకు ఆ యజమాని వారిలో ఒకనితో, ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నీవు నా దగ్గర ఒక దేనారం కొరకే పని చేస్తానని ఒప్పుకున్నావు కదా? నీవు నీ కూలిని తీసుకుని వెళ్లు. నేను నీకు ఇచ్చినట్టే చివర వచ్చిన వానికి ఇవ్వడం నా ఇష్టము. నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు. “కాబట్టి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు.

మత్తయి 20:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి, ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి. ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను’ అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు. దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్ళి, ఆ విధంగా చేశాడు. మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి, ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి, ‘మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. వారు ‘ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అన్నారు. అతడు, ‘అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి’ అన్నాడు. “సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, ‘పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకూ అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు. దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది. అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు. అప్పుడా యజమాని వారిలో ఒకడితో, “మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు. నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం. నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా?” అని అన్నాడు. ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.”

మత్తయి 20:1-16 పవిత్ర బైబిల్ (TERV)

యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు. “అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు. “అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు. “‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు. “అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు. “సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద దాసునితో ‘పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!’ అని అన్నాడు. “అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది. మొదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు కూడా ఒక దెనారా లభించింది. వాళ్ళు కూలి తీసికొని యజమానునితో ‘చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా చూస్తున్నారు’ అని సణగటం మొదలు పెట్టారు. “కాని అతడు ఒక కూలి వానితో, ‘మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు. ఒక దెనారాకు పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా? నీ కూలి తీసికొని వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా యివ్వాలనుకొన్నాను. నా డబ్బుతో నా యిష్టంవచ్చినట్లు చేసుకొనే అధికారం నాకులేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా?’ అని అన్నాడు. “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు.

మత్తయి 20:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి –మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. వారది తీసికొని – చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.