మత్తయి 19:16-26

మత్తయి 19:16-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అంతలో ఒకడు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏ మంచిని చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు. అతడు, “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. అందుకు యేసు, ఈ విధంగా చెప్పారు, “ ‘మీరు హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ అనే ఆజ్ఞలు.” అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు. అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు. అప్పుడు యేసు తన శిష్యులతో, “ఒక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు. శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యంతో, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు. యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యమే” అని చెప్పారు.

మత్తయి 19:16-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు. అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు. అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.

మత్తయి 19:16-26 పవిత్ర బైబిల్ (TERV)

ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు. యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు. “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు. యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు. తల్లితండ్రుల్ని గౌరవించాలి. మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు. ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు. యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు. ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం. నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు. శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు. యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.

మత్తయి 19:16-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు –ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యౌవనుడు – ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు–నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.