మత్తయి 19:1-9

మత్తయి 19:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్లారు. గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఏ కారణంగానైనా ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త వారిని ‘పురుషునిగాను స్త్రీగాను సృజించారు’ అని మీరు చదువలేదా? ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు. కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు. అయితే వారు, “అలాంటప్పుడు, ఒక వ్యక్తి తన భార్యకు విడాకుల ధృవీకరణ పత్రం ఇచ్చి ఆమెను పంపించవచ్చని మోషే ఆజ్ఞాపించాడా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు ఇలా సమాధానం ఇచ్చారు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ భార్యను విడిచిపెట్ట వచ్చునని మోషే అనుమతించాడు గాని ఆది నుండి అలా జరగలేదు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా, తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.”

మత్తయి 19:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు. గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు. పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు. అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు. అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.

మత్తయి 19:1-9 పవిత్ర బైబిల్ (TERV)

యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు. యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’ ఇది మీరు చదువలేదా? ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు. “మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు. యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.

మత్తయి 19:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత . గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా ఆయన– సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. అందుకు వారు–ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.