మత్తయి 19:1-30
మత్తయి 19:1-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్లారు. గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఏ కారణంగానైనా ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త వారిని ‘పురుషునిగాను స్త్రీగాను సృజించారు’ అని మీరు చదువలేదా? ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు. కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు. అయితే వారు, “అలాంటప్పుడు, ఒక వ్యక్తి తన భార్యకు విడాకుల ధృవీకరణ పత్రం ఇచ్చి ఆమెను పంపించవచ్చని మోషే ఆజ్ఞాపించాడా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు ఇలా సమాధానం ఇచ్చారు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ భార్యను విడిచిపెట్ట వచ్చునని మోషే అనుమతించాడు గాని ఆది నుండి అలా జరగలేదు. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా, తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.” ఆయన శిష్యులు ఆయనతో, “భార్యా భర్తల మధ్య పరిస్థితి ఇలా ఉంటే అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండడమే మంచిది” అని అన్నారు. అందుకు యేసు, “ఈ మాటను అందరు అంగీకరించలేకపోవచ్చు కానీ ఈ మాటలు ఎవరి కోసం చెప్పబడ్డాయో వారికి మాత్రమే. ఎందుకంటే తల్లి గర్భం నుండే నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, నపుంసకులుగా చేయబడినవారు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం నపుంసకులగా జీవిస్తున్నవారు ఉన్నారు. కాబట్టి దీనిని అంగీకరించగలవాడు అంగీకరించును గాక!” అని వారితో చెప్పారు. అప్పుడు ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి ప్రార్థించాలని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కాని శిష్యులు వారిని గద్దించారు. అప్పుడు యేసు, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పి, ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు. అంతలో ఒకడు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏ మంచిని చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు. అతడు, “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. అందుకు యేసు, ఈ విధంగా చెప్పారు, “ ‘మీరు హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ అనే ఆజ్ఞలు.” అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు. అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు. అప్పుడు యేసు తన శిష్యులతో, “ఒక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు. శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యంతో, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు. యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యమే” అని చెప్పారు. అప్పుడు పేతురు, “ఇదిగో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమి దొరకుతుంది” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు వారితో, “అన్ని నూతన పరచబడిన తర్వాత మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారిని తీర్పుతీర్చుతారు. నా నామాన్ని కలిగి ఉన్నందుకు తన కుటుంబాన్ని, అనగా సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను లేదా పొలాలను గృహాలను నా కోసం విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందుకొని, నిత్యజీవానికి వారసుడు అవుతాడు. అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.
మత్తయి 19:1-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు. గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు. పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు. అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ, ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా? కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు. అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు. భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు. ఆయన శిష్యులు, “భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది” అని ఆయనతో అన్నారు. అందుకు యేసు, “దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించ లేరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక” అని వారితో చెప్పాడు. అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లలను ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు. అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని గద్దించారు. అప్పుడు యేసు, “చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే” అని వారితో చెప్పాడు. ఆ పిల్లల మీద చేతులుంచిన తరవాత ఆయన అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు. అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు. అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు. అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు. నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”
మత్తయి 19:1-30 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు. యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’ ఇది మీరు చదువలేదా? ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు. “మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు. యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు. శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు. యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు. యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు. కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళనాపకండి!” అని అన్నాడు. వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు. ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు. యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు. “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు. యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు. తల్లితండ్రుల్ని గౌరవించాలి. మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు. ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు. యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు. ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం. నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు. శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు. యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు. అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం లభిస్తుంది?” అని అన్నాడు. యేసు, “ఇది సత్యం. క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు. నాకోసం ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు. వెనుకనున్న వాళ్ళలో చాలా మంది ముందుకు వస్తారు!” అని అన్నాడు.
మత్తయి 19:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత . గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా ఆయన– సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను. అందుకు వారు–ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను. ఆయన శిష్యులు–భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంస కులుగా చేయబడిన నపుంసకులునుగలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులునుగలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను. ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు –ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యౌవనుడు – ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు–నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు–ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.