మత్తయి 18:1-9
మత్తయి 18:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ సమయంలోనే శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పరలోకరాజ్యంలో అందరికంటే గొప్పవాడెవరు?” అని అడిగారు. అప్పుడు యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలుచుకొని వారి మధ్యలో నిలబెట్టి ఈ విధంగా చెప్పారు, “మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఈ చిన్నపిల్లల్లా తమను తాము తగ్గించుకునేవారు పరలోకరాజ్యంలో గొప్పవారు. ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. “ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు. నా విషయంలో ప్రజలను ఆటంకపరిచే వాటిని బట్టి లోకానికి శ్రమ. అయితే అలాంటి శోధనలు తప్పవు కాని అవి ఎవరి వలన వస్తున్నాయో, వానికి శ్రమ. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి లేదా నీ కాలు కారణమైతే వాటిని నరికి నీ దగ్గర నుండి పారవేయ్యి. రెండు చేతులు, రెండు కాళ్లు కలిగి నిత్యం మండుతున్న అగ్నిలో పడవేయబడే కంటే, కుంటివానిగా లేదా అవయవాలు లేనివానిగా జీవంలో ప్రవేశించడం నీకు మేలు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో జీవంలోనికి ప్రవేశించడం నీకు మేలు.
మత్తయి 18:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు. అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను. కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే. కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు. “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.
మత్తయి 18:1-9 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు. యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు. “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను. “కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది. “మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు.
మత్తయి 18:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.