మత్తయి 16:15-20
మత్తయి 16:15-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు. అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశారు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యపు తాళపుచెవి నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి” అని పేతురుతో చెప్పారు. ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు.
మత్తయి 16:15-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు. అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.” అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.
మత్తయి 16:15-20 పవిత్ర బైబిల్ (TERV)
యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు. సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.
మత్తయి 16:15-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.