మత్తయి 16:13-18

మత్తయి 16:13-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యేసు కైసరయ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనుష్యకుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని తన శిష్యులను అడిగారు. వారు ఆయనతో, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని, కొందరు ఏలీయా అని, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారని” జవాబిచ్చారు. అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు. అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు. అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశారు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.

మత్తయి 16:13-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?” వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు. “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు. అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు.

మత్తయి 16:13-18 పవిత్ర బైబిల్ (TERV)

యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు. యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు. సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు.

మత్తయి 16:13-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.