మత్తయి 14:22-32
మత్తయి 14:22-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు. ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. అప్పటికే ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి. రాత్రి నాల్గవ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు. వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు. పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు. కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు. వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు. వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది.
మత్తయి 14:22-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు. ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది.
మత్తయి 14:22-32 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి. రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు. యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు. పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు. “రా” అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు. యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు. వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది.
మత్తయి 14:22-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.