మత్తయి 13:3-23
మత్తయి 13:3-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు ప్రజలతో ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు. అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. దీనిని బట్టి నేను వారితో ఉపమానరీతిలోనే చెప్పాను: “వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు. యెషయా పలికిన ప్రవచనం వారి విషయంలో ఇలా నెరవేరింది: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు. ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి; వారు చెవులతో వినరు, వారు కళ్లు మూసుకున్నారు. లేకపోతే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, తమ హృదయాలతో గ్రహించి, నా తట్టు తిరిగి ఉండేవారు అప్పుడు నేను వారిని స్వస్థపరచియుండేవాన్ని.’ అయితే మీ కళ్లు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమైనవి. అనేకమంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విని దానిని గ్రహించలేకపోతే, దుర్మార్గుడు వచ్చి వారి హృదయాల్లో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. వారు దారి ప్రక్కన పడిన విత్తనాలు. రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు. ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు కాని జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ధనవ్యామోహం ఆ వాక్యాన్ని అణచివేసి ఫలించకుండా చేస్తాయి. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని గ్రహించినవారు, వారిలో కొందరు వందరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు ముప్పైరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.
మత్తయి 13:3-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ, ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి. చెవులున్నవాడు విను గాక!” అన్నాడు. తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు. కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది. ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు. యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు. చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు. ఈ ప్రజల హృదయం బండబారి పోయింది. వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది. వారి కళ్ళు మూసుకుపోయాయి. వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’ “అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి. చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను. “విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి. ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే. రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు. ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు. మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”
మత్తయి 13:3-23 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి!” శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు. ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది: ‘మీరు తప్పక వింటారు, కాని అర్థంచేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు కాని గ్రహించలేరు. వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. కాని అలా జరుగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’ కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం. “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి. “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు. “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.”
మత్తయి 13:3-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను –పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.