మత్తయి 13:20-22 - Compare All Versions
మత్తయి 13:20-22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు. ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు కాని జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ధనవ్యామోహం ఆ వాక్యాన్ని అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
మత్తయి 13:20-22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు. ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.
మత్తయి 13:20-22 TERV (పవిత్ర బైబిల్)
“దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు. “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు.
మత్తయి 13:20-22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.