మత్తయి 13:1-9

మత్తయి 13:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నారు. గొప్ప జనసమూహాలు తన చుట్టూ గుమిగూడుతున్నారని యేసు ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు. అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.

మత్తయి 13:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ, ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి. చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.

మత్తయి 13:1-9 పవిత్ర బైబిల్ (TERV)

అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి!”

మత్తయి 13:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.