మత్తయి 13:1-58
మత్తయి 13:1-58 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నారు. గొప్ప జనసమూహాలు తన చుట్టూ గుమిగూడుతున్నారని యేసు ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు. అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు ప్రజలతో ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు. అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. దీనిని బట్టి నేను వారితో ఉపమానరీతిలోనే చెప్పాను: “వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు. యెషయా పలికిన ప్రవచనం వారి విషయంలో ఇలా నెరవేరింది: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు. ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి; వారు చెవులతో వినరు, వారు కళ్లు మూసుకున్నారు. లేకపోతే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, తమ హృదయాలతో గ్రహించి, నా తట్టు తిరిగి ఉండేవారు అప్పుడు నేను వారిని స్వస్థపరచియుండేవాన్ని.’ అయితే మీ కళ్లు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమైనవి. అనేకమంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విని దానిని గ్రహించలేకపోతే, దుర్మార్గుడు వచ్చి వారి హృదయాల్లో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. వారు దారి ప్రక్కన పడిన విత్తనాలు. రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు. ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు కాని జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ధనవ్యామోహం ఆ వాక్యాన్ని అణచివేసి ఫలించకుండా చేస్తాయి. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని గ్రహించినవారు, వారిలో కొందరు వందరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు ముప్పైరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు. “ఆయన వారికి మరొక ఉపమానం చెప్పారు, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలను విత్తిన రైతును పోలి ఉంది. కాని అందరు నిద్రపోతున్నప్పుడు, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లాడు. గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. “ఆ పొలంలో పని చేసే దాసులు వచ్చి యజమానిని, ‘అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలను చల్లావు కదా! ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. “ఆయన వారితో, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు. “అందుకు ఆ దాసులు, ‘అయితే మమ్మల్ని వెళ్లి ఆ కలుపు మొక్కలను పీకెయ్యమంటారా?’ అని అడిగారు. “అందుకతడు ‘వద్దు, ఎందుకంటే కలుపు మొక్కలను పీకివేసేటప్పుడు వాటితో గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో. కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా కలుపు మొక్కలను పోగు చేసి వాటిని కాల్చివేయడానికి కట్టలుగా కట్టి ఆ తర్వాత గోధుమలను నా ధాన్యపు కొట్టులోనికి చేర్చండి అని కోత కోసే వారితో చెప్తాను అన్నాడు.’ ” ఆయన వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, ఒకడు తన పొలంలో నాటిన ఆవగింజ లాంటిది. అది విత్తనాలన్నింటిలో చిన్నదైనప్పటికి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటి కంటే పెద్దగా పెరిగి, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే ఒక చెట్టుగా ఎదుగుతుంది.” యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.” యేసు ఈ సంగతులను ఉపమానాలుగా జనసమూహానికి చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి: “నేను ఉపమానాలతో నా నోరు తెరుస్తాను. సృష్టికి పునాది వేయబడక ముందే రహస్యంగా ఉంచిన విషయాలు నేను మాట్లాడతాను.” అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లారు. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పొలం లోని కలుపు మొక్కల ఉపమానాన్ని మాకు వివరించండి” అని అడిగారు. అందుకు యేసు వారితో, “మంచి విత్తనాలను చల్లేది మనుష్యకుమారుడు. పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు. ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం ఆ కోత కోసేవారు దేవదూతలు. “కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు. వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది. వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు. ఇంకా, పరలోక రాజ్యం సముద్రంలోకి వల విసిరి అన్ని రకాల చేపలు పట్టే ఆ వలను పోలి ఉంది. ఆ వల నిండిన తర్వాత జాలరులు దానిని ఒడ్డుకు లాగి వాటిలోని మంచి చేపలను బుట్టల్లో వేసుకుని పనికిమాలిన వాటిని అవతల పారవేస్తారు. ఈ యుగ సమాప్తంలో అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి చెడ్డవారిని వేరు చేస్తారు. ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి. యేసు వారిని, “మీరు వీటన్నిటిని గ్రహిస్తున్నారా?” అని అడిగినప్పుడు. వారు, “అవును, ప్రభువా” అన్నారు. యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు. యేసు ఈ ఉపమానాలను చెప్పడం ముగించిన తర్వాత అక్కడినుండి వెళ్లి, తన స్వగ్రామానికి చేరి, సమాజమందిరంలోని వారికి బోధించడం మొదలుపెట్టారు. వారు చాలా ఆశ్చర్యపడి, “ఈ అద్భుతాలు చేసే సామర్థ్యం, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు. అయితే యేసు వారితో, “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేదు.
మత్తయి 13:1-58 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ, ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి. చెవులున్నవాడు విను గాక!” అన్నాడు. తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు. కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది. ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు. యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు. చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు. ఈ ప్రజల హృదయం బండబారి పోయింది. వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది. వారి కళ్ళు మూసుకుపోయాయి. వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’ “అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి. చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను. “విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి. ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే. రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు. ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు. మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.” ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది. మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు. మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. ‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు. అందుకు ఆ యజమాని, ‘వద్దు. కలుపు మొక్కలను పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో. కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.” ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. “పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు. అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.” ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో వేసి కలిపి అది అంతా పులిసేలా చేసిన పులిపిండిలాగా ఉంది.” “నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను. లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.” అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు. అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక. “పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు. “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు. “పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అందులో రకరకాల చేపలు పడతాయి. అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు. అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి, వారిని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి. వీటినన్నిటిని మీరు గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ, “గ్రహించాము” అన్నారు. ఆయన, “అందువలన దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశం పొందిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్త వాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిలాగా ఉన్నాడు” అని వారితో చెప్పాడు. యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి? ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి?” అని చెప్పుకుని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. అయితే యేసు, “ఒక ప్రవక్త తన స్వదేశంలో, తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు” అని వారితో చెప్పాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
మత్తయి 13:1-58 పవిత్ర బైబిల్ (TERV)
అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి!” శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు. ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది: ‘మీరు తప్పక వింటారు, కాని అర్థంచేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు కాని గ్రహించలేరు. వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. కాని అలా జరుగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’ కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం. “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి. “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు. “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.” యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు. “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. “పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు. “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.” ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.” యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.” యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు. దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి: “నేను ఉపమానాల ద్వారా మాట్లాడి, ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి దాచబడిన వాటిని చెబుతాను.” ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు. ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు. “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు. వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు. ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి! “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు. “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది. వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు. వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.” “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు. యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి? ఈయన వడ్రంగి కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, యూదా కదూ! ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు. ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది. యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని అన్నాడు. వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
మత్తయి 13:1-58 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను –పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి –అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. –ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు –వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలము లోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్య సంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజమందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.