మత్తయి 10:34-37
మత్తయి 10:34-37 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు. ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు. ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’ “తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు.
మత్తయి 10:34-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు. నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.
మత్తయి 10:34-37 పవిత్ర బైబిల్ (TERV)
“నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. ఎందుకంటే నేను, ‘తండ్రి కుమార్ల మధ్య, తల్లీ కూతుర్ల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య, విరోధం కలిగించాలని వచ్చాను. ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’ “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు.
మత్తయి 10:34-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు